ఆ తియ్యదనం, ఆ పదాల ఔన్నత్యం
ఎంత సాధారణంగా ఉంటూనే
ప్రతి అక్షరము వెదజల్లే ఆ పరిమళము
పరమ ఆనందం కలిగిస్తూ
మనసు నిండిపోయి, ఆ ప్రతి వాక్యమూ
ఏ అభిలాషో, అపేక్షలమయమో అయ్యి
ఆనందోల్లాసాల తృప్తిని కలిగిస్తూ
నీ ప్రతి రాత, ఆ రాతలోని
పదము, పదమూ
ఒక వాక్యము తరువాత మరో వాక్యమూ
అభిరుచికి తగ్గట్లుగా విచ్చుకుంటూ
నా అంగిలిని రంజింపఁజేస్తూ
అవి ఎన్ని వాక్యములు. ఎన్ని పాదములు
ఎన్ని పద్యకావ్యములు ఎన్ని అంత్యప్రాసలైనా
ఏమౌతుంది? మనో రంజకమే కాని ....
అది చందో కవిత్వమో, వచన కవిత్వమో
ఏ అద్భుత ఊహాజనిత కథో
ఏ వాస్తవ జీవితావిష్కరణో
పరిపూర్ణానందమో,
దుఃఖవేదనాత్మకమో అయినా
ఆ రాత ఏదైనా ....
నేను అర్థించేది మాత్రం
ఆ పద వాక్యాలు హృదయారాటం తగ్గించాలని
నా మది, ఆత్మలను అలరించాలని ....
అవి కూడా ఎప్పుడూ తపిస్తునే ఉంటాయి.
నీ భావనల నీడలో సేదదీరాలని
అంతరంగంలో శూన్యాన్ని నింపుకోవాలని
నాకు ఎంతో ఇష్టం ఆ పదాల రుచి
ఒకవేళ అవి నిజం గా
నన్నుద్దేశించి,
నా కోసం రాసినవే కాకపోయినా