Monday, February 29, 2016

అగంతకుడివి నీవు





















నీవే నా అన్నీను .... నిన్నటివరకూ
అలా అనుకోవడం లోని ఆనందం అనుభూతి
నీవూ అంతే అనుకుని ....
నాది కేవలం భ్రమే అని తెలిసేవరకూ

ఎదపూర్తిగా నిన్నే ప్రేమించాను.
నీతిమయం నియమంగా లోతుగా
సమర్పణాభావనతో
సమర్ధించుకున్నాను తప్పని తెలిసినా

నీవు నోరు జారినప్పుడు
ఎంతో భావోద్వేగురాలినయ్యేదాన్ని
నీవు నన్ను ముద్దాడినప్పుడు
నీ నవ్వు వెన్నెల్లో అమృతాన్ని చూస్తుండేదాన్ని.

ఆ నా ప్రేమంతా లిప్త పాటులో కోల్పోయాను
నీవు నన్ను కాదనుకుని
ఒంటరిని చేసి దూరంగా వెళ్ళిపోయి
విధ్వంసం, సర్వనాశం జీవత్శవాన్ని చేసినప్పుడు

నీతో పాటు తీసుకుని పోయావు
ఎంతో అమూల్యమైన నా ఆత్మను
నేనో మనిషిననైనా గుర్తుండేది
ఆ ఆత్మ అంతర్గతంగా నాలో ఉన్నప్పుడు

ఆగంతకుడివి నీవు ఆత్మను అపహరించావు.
నా ఆత్మ నాకు కావాలి ఇప్పుడు
నా కోరిక .... మళ్ళీ ప్రేమించాలని
మళ్ళీ భావుకురాలినై మళ్ళీ ప్రేమించబడాలని

ఆ ప్రేమించేవాడు నీలాంటి వాడవ్వరాదని
నిజం! ఎప్పటికీ గుర్తుండే అనుభవం నీవు
ఎప్పటికీ మార్పురాని ఒక మారని
నికృష్ట, నీచ, అధమ ఒంటరి ఆగంతకుడివి నీవు

Saturday, February 27, 2016

అవసరమా



అవిగో మల్లియలు అవిగో గులాబీలు
నీ చేతికి అందే అంత దూరం గా
నిన్నటివరకూ ....
నీ ముందే అందాలను కురుస్తూ
పరిమళాలను పరుస్తూ

నీవే చూడటం లేదు
ఇప్పుడు
అవి అక్కడ లేవు
వడలి రాలిపోయాయి 



ఎందుకీ నెమ్మదితనం తాత్సారం
అవి వడలి రాలేవరకూ
నీ కళ్ళ ముందే
అందుబాటులోని అందం
పరిమళాలను స్వాగతించేందుకు

మనసు విప్పి
మనో ఆహ్లాదం భావనలను
చెప్పేందుకు 
ఎందుకీ సందేహం బిడియం
ఆ బిడియమే అలసటై
పరితాపం గా మారుతూ

కదా



ఎంత మంచితనం
గడించామని
ఈ దోష బురద
దూళి మయ జీవితాలను
ఈది
ఏ ఆనందానికీ
మనం
అర్హులం కాకుండా

Monday, February 22, 2016

అమూల్యత ఆపాదించుకునేందుకు



ఎక్కడని కనుగొనగలను
నా అనుభూతుల ప్రతిధ్వనులను

నీ హృదయం లోనా
ఎక్కడ .... ఉనికిని కోల్పోయానో
అక్కడ .... లేక,
నీ కనుపాపల్లో నా
నాకు నేను స్పష్టంగా కనిపిస్తానా 
చూడగలనా ....
మూసిన నీ చేతులను విప్పి
లేక,
ఆ మూసిన చేతులే
నాకు స్వేచ్చను ప్రధానించునా



ఎక్కడని శోధించను
నీ నా స్వరాల ప్రతిద్వనులను
వినగలను .... ఎక్కడని చూడగలను.

ఆద్భుతమే కాని


చాలా కష్టం
సుమమే కదా అని
సున్నితంగా
ముద్దాడటం
ఒక బ్రహ్మ(ముండ్ల)జెముఁడు ను 
ఎంత వికసించినా
వర్షంలో
విస్తరిస్తున్న
ముళ్ళవనంలో 

Saturday, February 20, 2016

అస్పష్టతను నేను


నీ తోడనే ఉన్నాను ఎప్పుడూ
నీ ఆలోచనల్లోనే నీ వెంటే నడుస్తూ
అప్పుడప్పుడూ
నన్ను చూసి నీవు భయపడేలా చేసే
నీ నీడను నేను

చీకటిలా ఉండి ప్రాకుతూ
చూసేందుకు నేను శూన్యాన్నే కానీ
నీతోనే ఉంటుంటాను ఎప్పుడూ
నిన్నే గమనిస్తూ ....
నీ వెనుకో, పక్కనో, ముందో కదులుతూ

ఎప్పుడూ నీకు తెలిసేలాగానే ఉంటాను.
ఒక్కోసారి అతి చిన్నగా ఒక్కోసారి అతిగా
ఎప్పుడూ నిన్ను ఆలోచింప చేస్తూ
ఎంతో దగ్గరగా ఉండి
ఎప్పుడు ఎలా భయపడాలో తెలుపుతూ

నీ ఇంటి గోడలమీద నర్తిస్తుంటాను.
ఒక నీడలా, ఒక ముదురు కళంకం లా
అసకమసక గా అక్కడే
నీ పక్కన .... ఒక అస్పష్ట అస్తిత్వాన్ని లా
నీ వైపే తదేకం గా చూస్తూ

ఒక ప్రచ్ఛాయను లా ఎప్పుడూ
నీ ఊహల్లో జీవిస్తూ
నీ చుట్టూ .... నీ నీడల్నే తిప్పుతూ
ఏ ఎత్తిపొడుపు శూన్యం లా నో
ఏ ఉపరితలం భూతం లా నో

మసకచీకటి మంద్రపడుతున్న
ఏ చీకటి అంధకారాన్నో అయ్యి
సగం జీవితం రాత్రిళ్ళు నీకు కనబడను కానీ
నేను అక్కడే ఉంటాను ఎప్పుడూ
నీ పక్కనే తచ్చాడుతూ

మసకను చూసి భయపడేవు
సున్నితంగా స్పర్శించి చూడు
ఎందుకంటే
నేను అనే నీడ .... నీ సృష్టే
నీవే కారణానివి .... బ్రహ్మవు నా జన్మకు

నిన్ను ఒదిలి నేను ఎటూ వెళ్ళను.
నీవు కృశించినా మరణించినా
నీ నీడనయ్యే ఉంటాను
నిన్నే గమనిస్తూ పరిబ్రమిస్తూ
రూపాంతరం చెందుతూ నీతోనే ఎప్పుడూ

Thursday, February 18, 2016

గులాబి ముల్లు గుచ్చుకున్నా



అదో వింత ఆనందము,
ఆహ్లాదము
ఎవరినో ప్రేమించడం లో
ఒకవేళ
ఆ ఎవరో తిరిగి
ప్రేమించే అవకాశమే
లేకపోయినా
ప్రేమించరని ముందే తెలిసినా
ఈ నొప్పి
ఈ తియ్యని బాధ చాలు
ఇంకా జీవించే ఉన్నానని
తెలుసుకునేందుకు

Wednesday, February 17, 2016

మంచితనాన్ని పెంచాలి


ఎందరో అలమటిస్తున్నారు ఇంకెందరో రోదిస్తున్నారు
తాళలేక మరణిస్తున్నారు పసిప్రాణులు కొన్ని
ఎండిన ప్రేగుల ఆఖలితో నిరాశలో మ్రగ్గుతూ
వారి జీవితాల్లో
సూర్యుడు ఉదయించాడే కాని ప్రకాశించడం లేదు.

ఎవరున్నారు?
వారిలో ఆశలు నింపడానికి
జీవించడానికి వారికో అవకాశం కల్పించడానికి
సంపాదించుకుని
వారి కాళ్ళమీద వారు నడవడానికి

ఏదైనా చెయ్యొచ్చుగా చేతనయ్యింది
మంచితనాన్ని సహాయంగా అందజేసి
ఏదైనా నీకు అనిపిస్తే .... వారికి అవసరమని
ఏదో నేనూ చేసాను అని
చెప్పుకోవడానికి కాకుండా చెయ్యొచ్చుగా 


మనలో కొందరున్నారు చెడునే ఆలోచిస్తూ
ఏదో లేకే చెయ్యలేకపోతున్నానే కాని
ఉంటే చేసేవాడిని అంటూ
అవి, వ్యర్ధ పదాలు .... వాడొద్దు
జీవ వాద్యసాధనాల తీగెతో ఆశల శ్రుతిని
వినిపించేందుకు ప్రయత్నించాలే కాని

బుద్ధిహీనత, కాలాన్ని వృదా చేసుకో తగదు.
ఏదైనా సహాయం చెయ్యాలి
సాటి మనిషి అవసరానికి చేదోడుగా మారి
వారి జీవితాల్లో కాసింత ప్రకాశం చోటుచేసుకునేలా
ప్రేమను కరుణను కాస్తంత పంచి

కూడు, గూడు, గుడ్డ అవసరాలే సుమా
కాసిన్ని డబ్బులు సంపాదించుకునేందుకు
వారికీ ఏదైనా అవకాశాన్ని
కొద్దిపనినైనా సమ కూర్చి
వారిలో ఆశను చిగురింపచెయ్యొచ్చుగా

Monday, February 15, 2016

ఒక తోడువైతే బావుణ్ణు(నీడలా కాక )



నీ పేరు నా పెదవంచు మీద 
నాట్యమాడుతూనే  ఉంటుందెప్పుడూ 
నిద్దురలోకి జారే ప్రయత్నంలో ఉన్న 
రాత్రి వేళల్లోనూ .... ఒక పలవరింత లా

అన్ని వైపులకూ పొర్లుతూ ఉంటావు
నా నాలుక మీద .... నీకు తెలుసు, 
ఈ బెట్టు ఈ పట్టుదల .... నీతో
ఏ పోరాటం లోనూ నేను గెలవలేనని 

నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ 
తెలియని ఏ భయానికో నేను లొంగిపోతూ 
నీవు మాత్రమే కాదు 
నీ చేదు ఉప్ప కన్నీరైనా చాలు