నీ కాళ్ళమీద నీవు నిలబడి
భావనల్లో రోదిస్తూ
ఎవ్వరూ జత లేని
ఏకాకి భావన
అంతరంగమంతా నిండిపోతే
ప్రేమించబడాలనీ
స్థిమితపడాలనే మనోభావన
ఆనందంగా ఉండి
స్వేచ్చను పొందాలని
నిజంగా ఎప్పుడైనా అనిపించితే
ఎప్పుడైనా ఆపుకోలేని కన్నీరు
నీ ముఖంపై చారల్ని చేసి
ఈ ప్రపంచం లో నీకంటూ
ఓ స్థానం ఉందని అనిపించకపోతే
నిజం గా .... నువ్వొంటరివే
ఒంటరిగా నిలబడి ....
ఇంకా
నిజాలు లా నిలబడుంటే
ఆశ, అసూయలు
ఒంటరినై
వాటినే చూస్తూ
నేనూ అనే
అవ్యవస్థిత అస్తిత్వం
ఏనాడూ పుట్టి ఉండనట్లుగా
పుట్టుక చావులు
చైతన్యం శిలాతత్వాలను చూస్తూ
ఒంటరిగా ఏడుస్తూ
ఆ ఒక్క ఒంటరి కన్నీటిబొట్టూ
జార్చుకుని
ఒంటరిగానే మరణిస్తూ
ఉపయుక్తం కాదు
అన్నింటికీ సమాధానం కాలమే అని
ఎదురుచూస్తూ ఉండటం
మారుతుందని మారేవరకూ జీవితం
ఏ పందిరి ఆసరాగానో
పాకుతున్న లతను, అది పూర్తిగా పాకే వరకూ
చూపులు మరల్చకుండా
కూర్చుని దానివంకే చూస్తూ ఉండటంలా
జీవితం లో ఎన్నో ఆశలు ఆశయాలు గొప్ప గొప్ప కలలు
ఎవరో తోడు వస్తారని .... ఆలశ్యం చేసినా
సోమరివై అలక్ష్యం చేసినా
వాటిని సాదించి పొంది గమ్యం చేరే అవకాశం లేదు.
అలానే చూస్తూ ఉంటే కాలచక్రమూ ఆగదు ఎవరికోసం
జీవితం ఎంతో కష్టమనే అనిపిస్తుంది.
అంతే సులభతరం అవ్వాలంటే
భారంగా తీసుకోరాదు .... ఆనందిస్తూ అనుభూతి చెందాలే కాని
సమాధానం లేని ప్రశ్నంటూ ఏదీ లేదు
ప్రయత్నిస్తే చాలు .... చిరునవ్వులు చిందిస్తూ అన్ని వేళలా
ఆగకుండా సాగాలి ..... జీవనారంభం తొలి అడుగులా
ప్రతి అడుగూ ఉత్సుకతతో ముందుకు వేస్తూ ....

నీ ఆవేదన నీ తపన నీ ఆవేశం నీదే ....
ఎలాంటి అనుమానమూ లేదు .... నీవు కష్టాల్లోనే ఉన్నావు
కాలం నీపట్లే కటినంగా ప్రవర్తిస్తుంది .... నిజమే
కొన్ని నిజాలు ఎంత భయానకం గా ఉంటాయో ....
కాస్త బావిలోంచి బయటికి వచ్చి చూస్తే తెలుస్తుంది.
నీకో గూడుంది .... ఉండేందుకు, అపసవ్య నిద్ర కాదు నీది
ఎందరితోనో పోలిస్తే నీవూ ఎంతో కొంత ఉన్నవాడివే
కష్టజీవివే కాని అని .... అనిపిస్తూ
ఎన్ని వేలమంది మరణిస్తున్నారో ప్రతి రోజూ
నీలా ఒంటరీ కాని కనీసం సంఘజీవీ కాలేని వారు
నీ సమశ్యల్లో కేవలం ఝటిలత్వమే ఉంది కానీ వారి ప్రపంచంలో
వారి జీవితాలే వారికి ఝటిల సమశ్య, అతి పెద్ద శిక్ష
వారికే తెలుసు దారిద్ర్యం ఆకలి లోతులు
నైరాశ్యము దిక్కులేని దయారహిత జీవితం అర్ధం
ఎండిన పడీదుల్లాంటి ఎముకల పోగులు .... వారు
ఆరక్షణ మార్గదర్శకులు లేని ఎవరో విసిరేసిన వీధి బిడ్డలు
ఆకలి తీరడం కోసం చెత్తకుండీల్లోలో చిరిగిన వ్యవస్థ లో
వృధా ఆహారపదార్ధాల వెదుకులాటలో
స్వచ్చభారత్ నిర్మాణానికి దోహదపడుతూ కుక్కల్లా కొందరు
మాదక ద్రవ్య వర్తక యాజమాన్య అత్యాశలకు బలిపశువులౌతూ
దారిద్ర్యం నుంచి మాదకద్రవ్యాల వైపు ఈడ్చబడి
కారాగృహాల్లో శిక్షలనుభవిస్తూ
మానవత్వం మమకారం అర్ధం తెలియని మృగాలై .... మరి కొందరు

నీకున్నవి కష్టలూ బాధ్యతలే ..... నీకు కావల్సింది
కాసింత ధైర్యం నీపై నీకు నమ్మకము
కృషి చేసి నిరీక్షించే ఓర్పూ మాత్రమే
వారి జీవితాలతో పోల్చుకుంటే
ఆ వీధి అనామక అనాశ్రిత బిడ్డల స్థితి తో చూస్తే
అంత భారమైనదీ నిరాశాపూర్వకమైనదేమీ కాదు నీ జీవితం
మసకేసిపోయి
రాలిపోయిన
ఆ నక్షత్రాలను
ఎందుకు పట్టించుకోవాలి?
నాకంటూ నీవుంటే
నీ ప్రతి చూపూ
ఒక పరామర్శై
జతగా, మార్గదర్శివై
ఉద్యానవన పరిమళ
ఉద్విగ్నభావనవై నువ్వుంటే
ఇకనైనా ఆలోచించాలి
భవిషత్తును గురించి
గతాన్ని మరిచిపోయి
తొలి ప్రేమవు కాకున్నా
తుది ప్రేమవు నీవే కనుక
నేను తెచ్చిన బహుమానం
ఈ ప్రేమను నీవందుకోవాలి.
సహచరివై నువ్వుంటూ
అంతకన్నా కోరుకునేది
ఇంకేదీ లేదనుకుని
ఈ సృష్టి, ఈ భూమి
ఆ ఆకాశం ఆ నక్షత్రాలు
తారలు ఉన్నంతకాలం
నా ప్రేమసామ్రాజ్యం
పట్టపు రాణివి నీవనుకుని
మునిగి నిండా పేదరికం పీడకలల,
బాధల లోతుల్లోకి
నేర్చుకున్న పాటాలు, అనుభవం
అణగద్రొక్కబడిన నొప్పిలోంచి
తల చిట్టిలిన అనిశ్చితి లోంచి
కూరుకుపోయి ఒంటరి రాత్రుల్లోకి
అర్ధం కాని వింత నిశ్శబ్దం పలుకుల
రహశ్యాల లోతుల్లోకి జారిపోయి
...................
అయోమయం చీకటి నేలమాళిగ లో
నాలుక పిడచకట్టుకుపోయి, అంతలోనే
వెలుతురు నదిలా, అదో ఆశ
వద్దనుకుంటూనే కదిలి, తేలి
ఏ వైపుకో కొట్టుకుపోగలుగుతూ
వెలుతురు కనిపించి, శబ్దాలు వినిపించి
బలహీనతో ఆశో ఈదుతూ ....
ఉత్సుకంగా గమ్యం ఉదారత వైపు
నాకు ఇంత ఇష్టమా అని
చాలా ఆలశ్యంగానే తెలుసుకున్నాను.
పగిలి, విరిగి, తెగి చితికిన
పద పెళుసు వాక్యాల
బలహీన స్వరాలు కవితలవ్వడం పై
ఇంత ప్రేమా నాకని ఆశ్చర్యం వేస్తుంది.
అవే పదాలలోని .... అక్షరాల అస్తిత్వం,
ఆ ఔన్నత్యం
ఆ స్వచ్చ సత్యత
ఆ నిరాడంభరత
ప్రణమించాలనిపించేలా ఉంటూ
రాయబడుతున్న కవితల్లో మాత్రం
కారణ స్థిరతత్వ సంహారమే లక్ష్యం అన్నట్లు
పిచ్చి తలలలోనుండి
తప్పించుకునే ప్రయత్నం యుద్ధం లో
గాయపడిన అక్షరాలు క్షతగాత్ర సైనికుల్లా
అక్షర ఇటుకలు సమృద్ధిగా పేర్చి
సందిగ్ద మనోభావనలతో
బలవంతపు పదాలల్లి రాయబడుతున్న
ఏ వస్తురహిత సాహిత్యం పట్లనో
ఇంత మక్కువెందుకో .... నాకు
అనాలోచిత జీవనసరళి నడవడిక తో
ఒకప్పుడు .... ఒంటరి రహదారుల్లో
ఎవరూ లేక నాతో
నా ప్రేమను, నా ఆనందం అనుభూతుల్నీ
పంచుకునే జత గా
అంతా అసంతృప్తి అసంతులనమే ....
అప్పుడే నువ్వొచ్చి కలిసావు.
మార్గం చూపించేందుకే అన్నట్లు
ఒక మార్గదర్శకురాలివై
ఒక తోడు లా .... జీవ రహదారి అంతం వరకూ
ఒక సమాలోచన, వెలుతురు .... విజ్ఞతలా
అనిశ్చయాంశాల యౌవ్వనం అయోమయం
అయినా అన్ని అంశాలూ దూరమైపోతూ
నీవు సమీపంలో ఉంటే
జీవితానికి ఎంతో మూల్యత ఉందనిపిస్తుంది
అవకాశం ఉన్న అన్ని వేళల్లోనూ
నిన్నే చూడాలనిపిస్తూ.
నీ చిరునవ్వు లోనే నా ఆనందమంతా అనే
పొందాలనుకుంటున్నాను .... నిన్ను
నా జీవన భాగస్వామివి గా
నా మనోసామ్రాజ్ఞివిగా నా విజ్ఞతవు గా
నీతో కలిసున్నప్పట్నుంచి చూస్తే
ఎన్ని యేళ్ళు గడిచాయో నేటికి
ఎప్పుడూ
నా హృది లో
నా ఆలొచనల్లోనే ఉండే నిన్ను
ఆలోచిస్తుంటే అనిపిస్తుంది.
ఆశ్చర్యంవేస్తుంది.
అప్పుడప్పుడూ
నాలానే నీవూనా అని
నన్ను గురించే ఆలోచిస్తుంటావా అని
నిజం మానసీ ఎంత ఆశ్చర్యమో
ఎంత వింత సందేహమో
నిజంగా నీవు
నన్ను తలచుకుంటుంటావా అని
లేక నీ ఆలోచనల్లో
నేనో మరిచిపోయిన చరిత్రనా అని
ప్రతిరాత్రీ నిదురించుతూ నిన్నే
కంటూ ఉంటాను .... కలలో
ఒకప్పటి మసకేసిపోయిన
అలికేసినట్లున్న
మన మధురజ్ఞాపకాలను స్పర్శిస్తూ.
నిద్దుర లేచి పక్కన నువ్వులేవే అని
దిగాలుపడుతూ ఉంటాను. ఆశ్చర్యపడుతూ ఉంటాను.
మానసి ....నువ్వెప్పుడైనా కల కంటుంటావా నన్నని
నీ కలల నెలరేడునా .... లేక
ఏ చెరిపేసుకున్న జ్ఞాపకాన్నా అని
గడియలు, రోజులు .... వత్సరాలెన్ని గడిచినా
నీ, నా జ్ఞాపకాలు మాత్రం
అలానే నాతోనే పల్లవిస్తూ
పరిమళిస్తూ కొన్ని మసకేసిపోతూ
కాలం చెరపలేని మార్చలేని అనుభూతులౌతూ
అప్పుడప్పుడూ నిన్ను గురించే ఆనుకుంటాను.
ఎన్నిసార్లో అలా .... మానసీ
ఆశ్చర్యపోతూ ఉండటం .
నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను .... నీవూనా అని
ఎప్పుడైనా ఆలోచిస్తావా నన్నను ఆకాంక్షతో