ఉల్లంఘించాల్సొస్తున్నందుకు
బట్టబయలు చెయ్యాల్సొస్తున్నందుకు
కొన్ని నిజాలను, నగ్న సత్యాలను
పాడలేక, నీ అంత మాధుర్యంగా
అతి తియ్యదనాన్ని ....
అసత్యం తెవులును నింపలేక పదాలలో
బాధపడతానేమో కాని
నన్ను అర్ధం చేసుకోలేకపోతున్నావని
అసత్యాలకు తియ్యదనాన్ని పూచి
మధురంగా పాడలేను.
అనూహ్యంగా అనాలోచితంగా
అంతరాంతరాల్లోంచే రావాలి, ఏ భావనైనా
చిరుహాసంలా పెదవులమీంచి
తృళ్ళిపడి మాత్రం కాదు.
నన్ను మన్నించు
ఆ గాయాలు,
నీ మనస్సులో దిగబడుతున్న
ఆ మాటల చురకత్తుల పదునుకు
ఏమీ చెయ్యని నీ అసహన అసహాయతే కారణం
బురద గుంటలో చల్లదనంతో
సంతృప్తి పడే
ఏ పిరికితనాన్ని ప్రశ్నించడమూ నేరం కాదు.
దుఃఖపడుతున్నావా
ధనవంతుడ్ని కాకపోయానే అని ....
ధనం ఉంది, అవసరాలు తీర్చుకునేందుకే
ఆధిపత్యం చెలాయించేందుకు కాదు.
నా విచారం
నన్ను నేను విక్రయించుకోనందుకు కాదు.
నేను విచారిస్తున్నది.
నిజం గురించే, నా బాధంతా నిన్ను గురించే
No comments:
Post a Comment