Wednesday, November 19, 2014

ఎదలో...


నీకు విలువ కట్టలేనని
తెలిసింది
నేనూ నా ప్రపంచమూ సంపుర్ణంగా మారి
నా ప్రతి పనీ నీకోసమే
నిన్ను ఆకర్షించేందుకేనేమో అని
అనిపించాక
ఎందుకో
ఆ నక్షత్రాలను ఏరుకునైనా రావాలి
నిన్ను మెప్పించాలి అని
.......


తెలియదు ....
నీ ప్రభావం
నాపై ఇంతగా ఉంది అని
అనుకున్నది
నెరవేర్చుకునే పట్టుదల
నాలో లానే నీలోనూ అని
నాది ఇష్టమూ
నీది పట్టుదల అని
......
నిజంగా,
సూర్యకాంతి లేకుండా బ్రతకడం
గుండె కొట్టుకోకుండా ప్రేమించడం
మరి
నీవులేని నేను లేననే
ఈ భావనేలనో నాలో ....
బ్రతకలేననే
అల్లకల్లోలతలు ఏలనో ఎదలో

Tuesday, November 18, 2014

సముద్రపు హోరు


నీతో కలిసి .... గమ్యం చేరే ప్రయత్నం లో
ఆ విశాల సాగర అనంతపయనం లో
సుదూరంగా కనిపించిన
విశాల శిఖరాన్ని చూస్తున్నప్పుడు .... చిత్రంగా,
అలల సవ్వడి చెవులను
నీటి తుంపరలు శరీరము ను తాకి
నీవూ, నేనూ మమైకమైన క్షణాల లో
నేను నిన్ను భద్రంగా పొదువుకునున్నప్పుడు
మన ప్రేమానుభూతుల జ్ఞాపకాల నెమరు,
ఆ సముద్రపు హోరులో కలిసి కరిగిపోయి



Monday, November 17, 2014

సంఘర్షణ


వెళ్ళిపోదాము అనే ఆలోచనకు ప్రశ్నార్ధకం గా
వెనక్కు లాగుతూ ఉంది నా హృదయం .... నీ వద్దకు
ఎంత నడిచానో
బయలుదేరిన చోటే ఉండిపోతూ
శరీరం ముందుకు లాగుతూ
అవయవాలు సహకరించక అక్కడే ఉండిపోయి

అది సామర్థ్యలోపం అనుకోలేను.
నీనుంచి దూరంగా కదలలేని, ఆత్మ
నీ ప్రేమాకర్షణకు లోనైన ఎద
నీ ప్రతి శ్వాసలోని
నీ ప్రతి నిట్టూర్పు లోని
గోరువెచ్చని వెసులుబాటులా నన్ను ఆవరించి

కామ, మోహ ఆకర్షణలు ఏవో
నన్ను ప్రలోబపెడుతూ .... నాలో తత్తరపాటు
నీ కళ్ళు మెరుస్తున్నాయి .... నీవు
నా అంతర్మదనాన్ని చూస్తున్న భావన
నా హృదయం, నీ హృదయాన్ని చేరేందుకు
ఉబలాట పడటం, నీవు గమనిస్తున్నట్లు ....


చిక్కని చీకటి .... చుట్టూ
కారు మబ్బులు చంద్రుడ్ని కమ్మేసి
ఆకాశం నల్లగా .... ఆరుతున్న దీపాల్లా నక్షత్రాలు
మసక మసకగా మారుతూ
ఓ చెలీ! నా ఆశ .... తియ్యని నీ ప్రేమతో
నువ్వొస్తావనే, నా ప్రేమ ప్రపంచం లోకి

ఘనమైన ఆనందం


నా పేరును ఎవరో పిలుస్తూ
ఎక్కడినుంచో ఒక ఘనమైన ఆహ్వానం
ఆనుభూతి, ఆత్మానందం చేరువ కాబోతూ
బ్రమ కాని, మాయ కాని
విధి నాటకం .... అది.
ఏ తెలియని లోకం నుంచో
ఎవరో నన్ను పిలుస్తూ ....
నేను ఆకర్షితుడ్నౌతూన్నట్లు, 


ఒకప్పటికీ, ఇప్పటికీ భిన్నంగా
అప్పుడే ఒకప్పటిలా, ఎప్పటిలా
రూపాంతరం చెందీ చెందని మనోఃస్థితి లో
చేరాల్సిన గమ్యం ఎక్కడో ఉండి
అక్కడికే చేరుకుంటున్న
ఆత్మ విముక్తికి చెయ్యందిస్తూ
ఎవరో నన్ను పిలుస్తూ, ఆ ఆంతర్యం
ఘనమైన ఆనందమేదో ప్రసాదిస్తున్నట్లు

Wednesday, November 12, 2014

నీకన్నీ తెలుసనే .... ఓ చెలీ


ఎన్నిసార్లు జరిగిందో అలా
జీవన రహదారి లో
పరుగులు తీస్తూ
అర్ధరాత్రిళ్ళ లో
సూర్యుడ్ని పరామర్శించేందుకని
కాళ్ళకు చక్రాలు కట్టుకుని
పచార్లు చేస్తున్నప్పుడు 
నీవు గుర్తుకు వస్తుండటం
నీ అవిశ్రాంత హృదయం
నీ ఒంటరితనం
నీవు నిద్దుర రాక పొర్లుతుంటుండం
ఊహకు వచ్చి నవ్వుకుంటాను.
ఇదిగో చెలీ,
నా ప్రేమనంతా మూటకట్టి
నా పైనుంచి కదులుతున్న
ఈ మేఘాలపై పంపిస్తున్నా
నీ వెసులుబాటు కోసం

ఎందరో చెబుతుంటారు.
ఎన్నో విధాలుగా
జీవితం ఎంతో అమూల్యమని
రహదారి లో చేసేది కాదు.
సంసారం అని,
నిజం చెప్పు!?
నీవూ నేనూ కాదా
కలిసి జీవించాల్సింది,
ప్రేమను పంచుకోవాల్సింది.
పద్దతి, పరిపుర్ణత ఉన్నవారే
జీవించేందుకు అర్హులు అని
ఇలాగే నడుచుకోవాలి అని
అంటుంటారే ....
న్యాయమా ఓ చెలీ!
నా వెనుక నీవు నిలబడుండు చాలు
విదేయుడ్నయ్యి
నీ ముందుంటాను ఎప్పటికీ


గాలిలో ఎగరడం
గ్లోబులో .... మోటర్ సైకిల్
ఫీట్స్ చెయ్యడం
శరీరం మీద
పెట్రోల్ పోసుకుని
నన్ను నేను వెలిగించుకుని
నలబై అడుగుల క్రింద
నీటిలోకి దూకడం
తీగ మీద నడవడం
ఆకాశం కప్పు క్రింద సర్కస్
చెయ్యడం విదూషకత్వం
సాటివారిని నవ్వించేందుకే
స్థలమూ, సమయమూ
మార్చి మార్చి ప్రదర్శన
నా వృత్తి ధర్మం అది
ఆశ్చర్యమేస్తుంటుంది ఎప్పుడైనా
ఎక్కడ ఉన్నాను?
ఏమి చేస్తున్నాను?
ఎందుకలా? నీవు లేకుండా అని!?

ప్రేమించి
దూరంగా ఉండటం
సులభం అనుకోను.
ప్రేమ అనుభూతే అంత
ఇద్దరం అపరిచితులు లా
మళ్ళీ
ఒకరినొకరు కనుగొనే ప్రయత్నం
ప్రేమే
మాధ్యమంగా చేసుకుని
ఆనందాన్ని పొందుతుండటం
ఓ చెలీ!
నా వెనుక
నీవు నిలబడున్నావనే
నేనెంత విదేయుడ్నో
నీకు తెలుసనే
ఎంత విశ్వసనీయుడ్నో
ఎప్పటికీ ఎలా
ఎందుకు నీ వాడినో
నీకు తెలుసనే .... ఓ చెలీ!

Monday, November 10, 2014

నిజాయితీగా ఉంటాను .... ఓ స్త్రీమూర్తీ


ఎవరైనా ఎందుకు అలా ఎలా ప్రవర్తిస్తారో
వారి గురించి వారు ఏమనుకుని
మరొకరి స్వచ్చ భావనల ప్రేమను పొంది
ప్రతిగా ఎందుకు అన్యాయం చేస్తారో ....
ఓ స్త్రీమూర్తీ! నాకు తెలుసు!
ఇప్పుడు నీ మనోస్థితి గందరగోళంగా ఉందని
నీ ఎద ముక్కలై,
నీ మది ఒంటరితనాన్ని కోరుకుంటుందని

ఎవరో అల్లిన అబద్ధాల, అబాండాల వలలో
ఉక్కిరిబిక్కిరై .... ఎందుకిలా జరిగిందీ అని,
మదనపడుతున్నావు. అవును,
అబద్ధాలు చెప్పేవారు చెబుతూనే ఉంటారు,
కూలుతున్న గోడలను కడుతూనే ఉంటారు.
తప్పదు వారికి! ఎందుకంటే,
ఆదీ అంతమూ లేనిది అబద్దం కాబట్టి ...

ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా
చివరివరకూ నిలబడేదీ మాత్రం నిజమే ....
ఆ నిజమే నేను చెబుతాను .... అబద్దం చెప్పను.
నిజం నాలో నిక్షిప్తమై ఉంది కాబట్టే ....
ఓ స్త్రీమూర్తీ!
పుట్టింటి తలవంపులకు కారణమనుకోకు!?
వద్దు! వద్దు!! ఆరోపించుకోకు నేరాన్ని .... నీపై

జీవితం మధ్యలో వచ్చిన ఒక పురుషుడు చేసిన
ఒక పిరికి మాలిన నిర్ణయం,
ఒక పిచ్చివాడి చేష్టకు బలాన్ని చేకూర్చకు!
నీ మనసుకు నచ్చిన ఏ చోటుకైనా నేనూ వస్తాను .... నీతో కలిసి
నీకు సంతోషం కలిగించే పనులేవో తెలుసుకోవాల
ని, 
నా హృదయం లక్ష్యం .... నిన్ను ఉల్లాసంగా ఉంచాలని
నీ మనోపశమనానికి కారణం .... నే
ను కావాలని
అలా అని అబద్ధాలు చెప్పను
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, స్నేహిస్తున్నాను కాబట్టి .... అని,


వీడ్కోలు చెప్పను ఎప్పటికీ ....
నీవు ఒంటరితనం కోరుకోవడం కన్నీళ్ళు పెట్టడం సహించను
నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నానని ....
ఆ ప్రకృతి మాతకు మాత్రమే తెలుసు
నీకు చూసే కళ్ళుంటే 

నీవు నా ప్రేమను నా దృష్టి లో చూడగలవు
చూడగలవు .... నా జన్మకు పరమార్ధం నీవనే భావనను
నాకెలాంటి కారణాలూ లేవు ....
నిన్ను దూరం చేసుకునేందుకు
ఎంత బలమైన కారణం అయినా
నీతో నిజాయితీగానే ఉంటాను .... ఓ స్త్రీమూర్తీ

వింత ఆశ


చిత్రమైన ప్రశ్నలు .... అప్పుడప్పుడూ
నన్ను నేను ప్రశ్నించుకుంటూ
కొలను ఒడ్డున
నిశ్శబ్దంగా కూర్చుని
నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ
నిజమా? అని,

నేను చుస్తుంది
నిజంగా నన్నేనా అని
కొలను నీరు
నిజాన్ని చూడగలదా
నేను చూడగలిగినంతగా నన్ను అని
ఎన్నో సందర్భాల్లో ....


కొలనుకు ఆత్మావలోకనం చేసే శక్తే ఉంటే
ఎంత బాగుంటుందీ అని
ఆత్మల అందం ఆనందాల్ని 
ప్రతిబింబించి ప్రపంచానికి పరిచయం చేసెయ్యాలని
ఎందుకో
నా నన్ను ను ప్రతిబింబించితే చూడాలని

Friday, November 7, 2014

అభిమానాన్ని


ఇక్కడే, నిగూఢ స్థలంలో ....
భద్రంగా 
నీ ఆత్మ లో
లోతుగా, పాతిపెట్టబడి ....
నీ అహం తెర వెనుక


ఛేదించరాని గత చరిత్ర
పుటల గోడల
సంరక్షణలో
నమ్మకం కలించలేని
వాగ్దానాన్ని లా 


చెలీ,
నేను .... నీ అభిమానాన్ని

Thursday, November 6, 2014

విచ్ఛిన్నమై ....


రెండు గా ముక్కలైన గుండె
విఫలమైన ప్రేమ
సగం, ఆమె కోసం ....
శ్వాస అందక మిగిలిన సగం
కొట్టుకో లేక .... లయబద్దం గా
ఎప్పటికీ 


కలవని
ఆ పగుళ్ళ రసి
వికటించిన ఆ ప్రేమ భావనే
కారుతూ ....
ఆమె కై, పశ్చాత్తాపం చుక్కల్లా