Friday, October 31, 2025

 కలో నిజమో

నిన్న రాత్రి నేనొక లోయలో పడ్డాను
తెలియని భయం
నిశ్శబ్ద స్వరాల .... లోకం
చీకటి ప్రతిధ్వనులు ఎగతాళి చేస్తూ
ఉక్కిరిబిక్కిరి చేస్తూ కటిక చీకటి
తప్పించుకోగలననే ఆశ లేదు
వినిపిస్తుంది కేవలం
నా గుండె లోతుల్లో జారిన
ఒక చిన్న నిస్సహాయ అణగారిన నిట్టూర్పు
నా స్వరం ప్రతిద్వనులుగా మారి
సహాయం కోసం పిలుస్తుంది
వినిపించుకోదని తెలిసీ
వినిపించుకోవడమే మానేసిన ప్రపంచాన్ని

 



కాలం కరిగింది  



నిశ్శబ్దం నన్ను ఆలింగనం చేసుకున్న భావన  


నేను మునిగిపోతున్నాను ....

ఒక సరస్సులో రాయి పడినట్టుగా 

శబ్దం లేకుండా, అలల అల్లరి లేకుండా,

లోతుల్లోకి ఇంకా లోతుల్లోకి జారి కరిగిపోతూ 


నా చుట్టూ ఉన్న ప్రపంచం 

మెల్లగా కరిగిపోతోంది. 

ఒక పాత జ్ఞాపకంలా,

తెల్లని పొగలా మారి మాయమైపోతోంది.


నా ఆత్మ తుక్కలై తుక్కలు విడిపోతున్నాయి.

ఒక్కొక్క తుక్క దూరంగా తేలుతూ 

నీటి అడుగుకు .... నిశ్శబ్దంగా చేరుకుంటూ 


రోజు ముగిసింది ....

మిగిలిందేమిటంటే ఒక తేలికైన శ్వాస,

ఒక సున్నితమైన నిశ్శబ్దం,

మరియు నేను నన్నే దూరం నుండి చూస్తూ   



Saturday, September 20, 2025

 అంతా కొత్తే


ఎన్నడూ అనుభూతి చెందలేదు
ఇక ఎప్పుడూ సంతోషంగా ఉండలేనేమో అన్న భావనే ....
వెంట వెంటనే గుండె బ్రద్దలైన బాధ

కానీ, ఏదో ఒకరోజు అంతా ఇలా మారుతుందని
అనుకోలేదు .... ఎవరో జీవితంలోకి వస్తారని
ముందెన్నడూ లేని అనుభూతిని కలిగిస్తారని

ఎప్పుడో అప్పుడు ఏదో జరుగుతుంది
మనం చేయగలిగేది కేవలం నవ్వుకోవడం మాత్రమే
గుండె మళ్ళీ కలపబడుతూన్నట్లు అనిపిస్తూ

భయం మాత్రం ఉంది .... ఔనా!?

Thursday, September 18, 2025

 


నిశ్శబ్దపు వేదన  


మాటలతో చెప్పలేను 

ఈ నిశ్శబ్ద వేదనను    

సమయంతో దాచలేను 

గతం సంఘటనల్ని 


కళ్ళతో చూడలేను 

పగిలి విడిపోయిన ముక్కల్ని

ప్రేమతో దాచలేను 

వేదన మాయల ప్రవాహాన్ని 


నరకం కూడా మార్చలేదు 

ఈ పెరిగిన ద్వేషాన్ని

ఏ ఊహకు అందని బాధ 

ఈ గడ్డకట్టిన గుండెది  


Wednesday, September 17, 2025

 


నిశ్శబ్దరాగం  


కన్నీళ్లు ఆమె చెంపలను అల్లుకుని 

.... మెల్లగా జారుతూ 


అవి అతని పెదవులవైపు జారి ఆ బాధను 

మౌనంగా పంచుకున్నాడు అతను       


ఒక నిశ్చల ఆలింగనంలో, మౌనంగా 

వారు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు.  


ఆ ఇద్దరికీ తెలుసు,

ఆ గదిలో, వారి శరీరాలు, ప్రేమ మాత్రమే కాదు

ఒక దొర్లిపోయే వీడ్కోలూ వారి మధ్య ఉందని. 


అతడి కన్నుల్లో బాధ ఈతేస్తూ,

ఆస్వాసం గాలిలా విరుస్తూ   

ఆమె శిరోజాలతో ముడిపడుతూ ....


అతడు ఆమెను మరింత దగ్గరకు లాగాడు.

ఆమె పెదవులు కంపించాయి 

అతడి ఊపిరి అసమానంగా మారి 


ఆమె పెదవులు .... ఆ నిశ్శబ్ద క్షణంలో 

అతడి పెదవులతో మెల్లగా జతవుతూ  







Monday, September 15, 2025

 ప్రత్యక్ష జ్ఞానం 


కీళ్ళవాతంతో వంగిన ఆమె వేళ్లు 

రంగు వెలిసిన తోలు కాగితం మడతలు విప్పి 


.... పొదిగిన పొడిపొడి అక్షరాల కన్నీళ్ల, మాటల 

మరకల అస్పష్టతను .... అనుభూతించాలి అని   


కానీ, అంధత్వం ముదిరిన ఆమె కళ్లకు 

ఏమీ కనిపించక పోయినా .... 


ఆ కాగితం మడతల్లోని మనోభావనలు మాత్రం 

అన్ని నాళ్ళ తర్వాత కూడా .... 

పూర్ణ ప్రత్యక్ష జ్ఞానం పొందిస్తాయనే ఆశతో ఆమె    

Friday, September 5, 2025

 


ఏకైక మార్గం 


అనుకోని మార్పు 

జీవితంలో ప్రవేశించినప్పుడు 

నాకు తెలియకుండానే 

ఒక ప్రశ్న ఉద్భవించింది. 


ఇప్పుడే ఇది ఇలా 

ఎందుకు జరుగుతుంది అని?


నేను నిర్మించుకున్న

ఏకాంత కట్టడంపై 

ఇలా కూలిపోయేంత 

తీవ్ర ప్రభావమా అని? 


కళ్ళ ముందు ఒక్కసారిగా 

పెద్దగా తెరుచుకుంది ప్రపంచం 

నేను నిలబడే ఉన్నాను  

అసహాయంగా ....


రక్షణ కోసం గోడలు లేకుండా 

మార్గం చూపే చిహ్నాలు లేకుండా 

కేవలం ఇతరుల మాటలు 

మదిలో ఆశలు మాత్రమే మిగిలి  


నేను సిద్ధంగా లేను 

ఎప్పటికీ సిద్ధంగా ఉండను  

కానీ ఎప్పటికైనా 

ముందుకు వెళ్ళే ఏకైక మార్గం 

దాటడమే  

 


కోపం మూలుగు


ఎన్నో సందర్భాలలో ఏకైక పరిష్కారం 

ఏ మూసిన గదిలోనో

ఒంటరిగా కూర్చొని 

కన్నీరు కార్చాల్సి రావడం 

ఊపిరి ఆగిపోయేలా శ్వాసించి   

గుండె వేదనను పూర్ణానుభూతి చెంది   

బహిర్ముఖశ్వాసతో 

గాలి వేడెక్కేవరకు నిశ్వాసించి 

అంతా మాయం అయ్యేవరకు 

అనుభవించాల్సి రావడం   


Thursday, August 7, 2025

 పైకి లేవాలి!



పడిన చోటు నుండే .... 

అణిగిపోయాను, ఓడిపోయాను...

నా గొంతుకను నేను అణచుకోవడం తప్ప, నాకు వేరు దారి లేదు. 

ఇప్పుడు నేను, నీ సాంగత్యానికి దూరంగా వెళ్ళాలి. 

రేపు లేని ఒక మూలలో ....

నేను కేవలం ఒక నీడలా 


వానలో తడుస్తూ నడుస్తున్నాను,

నిస్సత్తువగా, నీరసంగా ....

రాత్రి చలిలో వణుకుతూ,

చీకటిలో నా చూపును కోల్పోయి.


ఇది ఓడిపోయే సమయం.

నువ్వు ఆమె మమైకమైపోయి నవ్వుతూ   

ఇక నువ్వు నాతో ఉండవు ....

కేవలం ఆమెతోనే 

ఓటమి అంటే ఏమిటో నాకు పూర్తిగా అర్ధమైంది. 

నువ్వు నాతో లేవని .... నువ్వు ఆమె వేరుకారని.   


కానీ, ఇది ముగింపు కాదు.

ఇది కేవలం ఒక జ్వరం.


ఈ గోడను బద్దలుకొట్టుకుని నేను బయటపడాలి.

నేను పడిన చోటు నుండే .... పైకి లేవాలి!  


 

 


కలగంటా  


కలగంటా .... ఈ రాత్రి నిద్దురలో నీ గురించి 

లోకం తప్పుపట్టేదేమో అనిపించే వాటి గురించి 


నీ స్పర్శకై నేనెంతగానో ఆరాటపడతానో, ఆ స్పర్శకై 

నీతోడి భవితకై నాకున్న ఆశ గురించి 


కలగంటా .... ఆ కొత్త అనుభూతికై, నాలో కలిగే ఆ పులకింతకై 

ఎంతో అపురూపం, నా పాలిట సర్వస్వం అనిపించే దానికోసం 


నాకు పట్టలేని పరవశమిచ్చే, ఆ ఆనందం కోసం  

తప్పకుండా నా జీవితాన్నే మార్చేస్తుందనే నమ్మకంకై  


కలగంటా .... మనం పంచుకోనున్న తీపి గురుతులకై 

ఒకరికొకరం పంచే ఆప్యాయతతో గడిపే సుందర క్షణాలకై  


హృదయాన్ని ఉప్పొంగించే కలను నేను కంటా

కలల లోకం వీడగానే, అదే గుండెను ముక్కలు చేసే కలను కంటా 


నే చెప్పేది ఓ కల కథనం

నన్ను ఉద్ధరించే ఓ కల, నన్ను విడిపించే ఓ కల ....


చాలా కాలంగా నాకిష్టమైన నాకు దూరమైన దాన్ని .... 


నా జీవితం .... ఇప్పుడిలా వెలితిగా, తప్పుగా తోచే నా జీవితం

నిజమవ్వాలనే ఆశ, అయినా తీరదేమోనన్న సంశయం నింపే కల 


ఏమైనా సరే, నేనెలా ఉన్నా, ఆశగా నేను ఎదురుచూసే కల 


ఇది నా కలల కల, నాలోని ఓ స్వప్నం

ఈ కల, ఎప్పటికైనా నిజమైతే, వద్దనను ఏనాటికీ  



 

Wednesday, August 6, 2025

 


క(అ)లలు   


జీవితం ఒక ప్రవహించే ప్రవాహం 

విభిన్న తీరాలకు తీసుకువెళ్తూ 


అందుకే .... కాసింత సమయం తీసుకో 

నీ గురించి నీవు కలలు కనేందుకు 


నువ్వు ఏవిధంగా ఉండాలనుకుంటున్నావో 


ఎవరిని 

నువ్వు చూసేందుకు తహతహలాడుతున్నావో 

వారికై .... కొంతసేపు కలలు కను  


ఆ ఎవరో గురించి 

నిన్ను చిరునవ్వుతో మురిపించే ఆ వ్యక్తి గురించి 


నీవు చేయాలనుకున్న పనుల గురించి 


ఈ ప్రపంచానికి

చివరిసారి వీడ్కోలు చెప్పే ముందు వరకూ 


అన్ని విషయాల గురించీ కలలు కను  


Thursday, July 31, 2025

 


మనసు తలుపు


నా మనసు తలుపు 

ఎప్పుడో మూసుకుపోయి ఉంది

ఎవరినీ లోపలికి రానివ్వకుండా 


ఎన్నో ఏళ్లు ....

అలాగే మూసుకుపోయి ఉంది 


కానీ ఎలాగో నువ్వు వచ్చావు 

ఎప్పుడు గమనించావో, వచ్చావు 

దానికి సరిపోయే తాళం చెవితో 


నీ ప్రేమను పంచుతూ ....

అంతులేని కొత్త ఆశలను చూపిస్తూ  


Tuesday, July 29, 2025

 లక్ష్యసాధన    


ఎప్పుడు ఎలా ఉన్నా, ఏది ఎదురైనా 

వెనక్కి తిరిగి చూడకుండా 

ముందుకే సాగాలి    

 

దారి ఏదైనా .... ఏది ఎదురైనా  

ఎవరేమి అనుకున్నా  

మన లక్ష్యం .... జీవితంపై గెలుపు   


జీవితం ఒక సవాల్ 

ప్రతీ పరాజయమూ 

ఒక పాఠం  


సక్రమమైన సిద్ధతతో   

విజయపదం వైపు 

కదిలే క్రమంలో .... మనం  


సమర్థతను కౌగిలించుకుని 

సోమరితనం  

దూరంగా పెడదాం 


విజయసాధన .... గెలుపు కోసం 

పాదాలకు బలమిచ్చి   

ముందు ముందుకే కదులుదాం  

 

Monday, July 28, 2025

 పగిలే ఎప్పటికీ  


నేను, ఆ వాయిద్యంలోని 

రంధ్రాలన్నింటిలోంచి 

ప్రయాణం చేసా 


ఇప్పుడు నేను 

ఓ పగిలిన స్వరాన్ని 


ఆ వాయిద్యం గుండెలోంచి 

నన్ను గెంటేసారు 


మళ్లీ అందులోకి 

దూరాలని ప్రయత్నించా   

పలితం లేకపోయింది  


ఇక ఆమె పాడే పాటలో 

నేనుండను  

ఇకపైన ఎప్పటికీ  

మళ్లీ ఎప్పటికీ .... ఉండనేమో 

Thursday, July 24, 2025

 నీవు నేను 


నీ కళ్ళే .... అంతులేని   

నేను మునిగిపోవాలి అనుకునే   

లోతైన నిఘూడ సాగరం    


నీ శరీరం .... సుదూరంగా  

నేను పదే పదే, సంధ్య నుండి ఉదయం వరకు 

అలలా వచ్చి తాకాలనుకునే తీరం  


నీ ఆత్మ .... అనంత అగాధం 

నా రహస్యాలన్నింటినీ

భద్రంగా దాచుకోవాలనిపించే అంతరాళం  


నీ ప్రేమే .... నా నివాసం 

నీ అలల తాకిడితో  

నన్ను తీరం చేర్చే పరిపూర్ణత్వం  

Tuesday, July 22, 2025

 


విరిగిన మనసు  


ఏ ప్రయత్నమూ లేకపోయినా .... 

మనసులు విరుగుతూ ఉంటాయి  


చివరి ముద్దులో తడిపిన భావాలు

చెవిలో ఊగే గాలిలా 

విసురుగా తాకే బాధగా మారి   


కాలం నా కోసం నీ కోసం ఆగదు 

మన ప్రేమకి రెక్కలు రావు  


తాకాలన్న కోరిక లోపల ఉరకలేస్తూ 

మధ్య మిగిలేది గాలి మాత్రమే 


ఒక పాట .... రాగం లేకుండా 

పాడే శక్తిని కోల్పోయినట్లు   


పట్టుకోలేనంత త్వరగా

విడిపోతున్న క్షణాన్ని పట్టుకునే ప్రయత్నం .... 

గాలిలో వేలాడే తలపులా    


 చీకటి కవిత

ప్రతి లైనూ
విషాదమే నా రాతల్లో
తన రోత మురికి జిగురు మత్తు
నిశ్శబ్ద నీడల రాత్రిలో కరుణగా జారిపడుతూ
చినుకు తడిచిన కాగితంపై
వణికే చేతులు గతాన్ని తడుపుతూ
ఆ నవ్వులు నిండిన రోజులు .....
ఇప్పుడొక మాయ అయిన కలలై
ప్రేమ .... అనుభూతి మాత్రమే అయిపోయి
మళ్ళీ ఎప్పటికీ తాకలేని ఓ కోరికగా మిగిలిపోయి
ప్రతి పశ్చాత్తాపంలోంచి
ఒక కొత్త కవిత పుడుతూ
చీలిన మనసుతో
అమావాస్యలా ఆమె మళ్లీ వచ్చింది
ఈ రాత్రి కూడా
నా కవిత్వంలో ....
విషాదం చీకటి కవితయ్యి

Thursday, July 17, 2025

 ప్రచ్ఛన్నవేదన


ప్రతి గొడవలో 

పగిలిపోతున్న నా గుండెకు,

తప్పెవరిదో తెలియదు.


నువ్వు చూసేది నాలోని కోపాన్ని,

నువ్వు చూడనిది 

రాత్రిలోని నా కన్నీళ్లను.


నేను ఓ ఆటబొమ్మను కాను  

ప్రేమకై పరితపించే 

ప్రాణాన్ని.


నాక్కావలసింది ఒక్కటే  

నీ కోపం కాదు,

నీ ప్రేమ


 


విధిరాత 


నీపై నా ప్రేమ 

నిజం అని 

మన దారులు 

వేరు అని 

తెలిసీ   

ముందుకే 

మన గమనం 

అగమ్య యానం       

తప్పని విరహం  

కన్నీళ్లతోనే ....  




Tuesday, July 15, 2025

 


కలం సిరా కాగితం 



కలం నుండి ఒలికే సిరా  

ఆశయం ఆవేశం భావనల మధ్య 

ఆత్మ ఔన్నత్యానికి స్వేచ్ఛనిస్తూ    


అప్పటికే నలిగిపోయిన కాగితాలపై

సున్నితమైన ఆలోచనలు  

సాధారణమైన మాటలు రాస్తూ  


నా కళ్ళముందు ఎంతో అందమైన 

సృజనాత్మకమైన త్రయం  

అన్నీ ఒకదానికొకటి అల్లుకుపోయి