Tuesday, May 6, 2025

 వీడ్కోలు వేళ

ఎంతకాలమో ఎదురుచూసి, చూసి
అప్పుడే వీడ్కోలు చెప్పాల్సి వస్తే
అర్థమౌతుంది ఎవరికైనా
లేని నిన్ను ప్రేమించడం,
ఎదుట ఉన్న నిన్ను ప్రేమించడానికంటే
ఎంతో మేలైన అనుభవం అని
కనిపించని నీ జ్ఞాపకమే
నా గుండెకు నిజమైన తోడు అని

 అబలను తప్పిపోయాను

తప్పిపోయాను ..... విశ్వసించ లేని లోకంలో
విషాదం మరియు ద్వేషంతో నిండిన లోకంలో
బయటపడలేను అనిపిస్తుంది
కానీ ఆశ ఎప్పటికైనా నిన్ను చేరగలను అని
తప్పిపోయాను ..... ప్రేమలేని లోకంలో
తెల్లని రెక్కల పావురంలా స్వేచ్ఛగా జీవించాలి అని
నా తపనను వినే వారెవ్వరూ లేరు
కానీ ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలి అని
తప్పిపోయాను ..... ఉండేందుకు గూడు లేని లోకంలో
ప్రతిరోజూ భయం ఒంటరితనం ముంచుకొస్తూ
కలత భయం కఠిన కంటకం లాంటి రాత్రిళ్ళు
ఐనా ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలి అని
తప్పిపోయాను ..... కన్నీళ్ళు కలలు రాని లోకంలో
ఇక్కడ నిజం లేదు, అసత్యాలే అన్నీ
ఇక్కడ నిజం దొరకదు కేవలం అబద్ధాలు మాత్రమే
ఈ స్థలానికి అతి తొందరగా వీడ్కోలు చెప్పాలి అని
నీవు ఉన్న చోటే ..... నేను ఉండాల్సిన స్థలం
ఏం జరిగినా, జ్ఞాపకం చేసుకుంటాను నిన్ను
నేను ఒక ప్రకాశం లేని, శబ్దం లేని
తప్పిపోయిన అమ్మాయి ..... ఒక దొరకని అమ్మాయిని
ఎన్నిసార్లో తప్పించుకునే ప్రయత్నం చేసి .....
మళ్ళీ మళ్లీ పట్టుబడి
ఎంత పోరాడినా ఫలితం లేక .....
శ్వాస భారం కాక తప్పడం లేదు
అందుకే వెళ్ళిపోవాలి అనిపిస్తుంది
సహించలేకపోతున్నాను
సహనం అంచుల్లో ఊగులాడుతున్నాను.
ఏ దారి కనిపించడం లేదు.
అలాగ అని తప్పిపోయినట్టుగా
తెగింపు కొల్పోయిన దానిలా ఉండాలి అని లేదు
దాని కోసం ఎంత కష్టమైనా సరే భరిస్తాను
ఏదో ఒక రోజు నేను తిరిగి వస్తాను
అన్నీ నేర్చుకుని ..... నీవు ఎంత దూరంలో ఉన్నా
నీ సమీపానికి అచంచల నమ్మకంతో
నా మనసులో, గుండెలో నీవే ఉన్నావెలావో లా
నీ జ్ఞాపకాలతో — ఎప్పటికీ నేను ఇలా

 తప్పించుకో

మధ్యస్థత వీధుల్లో
నిలువెత్తున
పాతుకుపోయిన
అనాశక్త జీవనపు
అడ్డు గోడలు
అడ్డంగా పగులగొట్టి
స్ఫూర్తిదాయకం కాని
ఆ అస్తిత్వపు
అడ్డంకుల్లోంచి
ఈ విశాల
ప్రపంచపు
వెలుగు వైపు
స్వేచ్చగా
పరుగులెత్తు
వెనక్కి చూడకు

 ప్రయాణం

ఎప్పుడూ
తిరుగుతూ
పైకీ
క్రిందకీ
మళ్ళీ మళ్ళీ
తనచుట్టూ
తాను
సైకిల్ లా
పట్టు
కోల్పోకూడని
ప్రయాణం
జీవితం
కష్టసుఖాల
మలుపులు
ఆగిపోకపోయే
వాస్తవం
ఆ ప్రయాణం

 కొలవలేని క్షణాలు

గడిచిన కాలాన్ని కొలవడం ఎంతో కష్టం
నీతో గడిపిన కాలాన్ని ....
ముఖ్యంగా
మధుర స్మృతులుగా మారిన క్షణాల్ని
నీ కోసం నేను ఎదురుచూసిన క్షణాలు
శతాబ్దాలైనట్లుంటే .....
ఈ తీపి నొప్పుల ఎదురు చూపుల
ఎడబాటు క్షణాల దూరాన్ని
చాలా కష్టం కొలవగలగడం
కనుకే ఈ ఆశ
దయగల విధి ముందు నా కోరిక
నా సమయం కేవలం నీపై ఖర్చవ్వాలని

 జీవయానం

ఎందుకో అనిపిస్తుంది.
నేను ఎక్కువగా ఉంటున్నానేమో?
చాలా మందికి విసుగు తెప్పిస్తున్నానేమో?
ఎన్నోసార్లు, ఎంతో ఎక్కువగా ....
ఎవరూ తట్టుకోలేనంతగా?
ఇన్నినాళ్లుగా ....
పదాల శరాల్ని
వెదజల్లానేమో అని
ఇప్పుడు అనిపిస్తుంది.
అవన్నీ నా బ్రతుకుతెరువు కోసమేనా?
ఆ అనంత రచనాచరణ
ఒక గొప్ప వంతెనను
నిర్మించిందా?
నన్ను గొప్ప భవిష్యత్తులోకి
తీసుకెళ్లేందుకు?

 ఒకే ఒక్క కోరిక

ఒక వేళ ఈ జీవితం నెడో రేపే ముగిసి
ఈ శరీరం దుమ్ము దూళిలో కలిసిపోయినా
నా ఒకే ఒక్క కోరిక మాత్రం
కష్టాలు లేని జీవితం నీ సొంతం కావాలని
కాలచక్రం వెనక్కు తిప్పేంత శక్తిమంతుడ్నే ఐతే
నా నైపుణ్యంతో నీ కోరికలు తీర్చెవాడ్ని
విరిగిన భాగాలు తగిన విధం ఒక్కటి చేసి
జీవ ఆనందం మనం కలిసి పంచుకునేలా చేసి

 పరాకాష్ట

నీవు, నీ ఆకృతి ఓ ప్రత్యేకం
నీ ఎత్తు, నీ బరువు,
నీ శరీరం, నీ చర్మం,
నీ కళ్లూ, నీ జుట్టు రంగు
నిజంగా నీవు ప్రత్యేకం
ఎంతో వైరుధ్యం నీవు
నీ నవ్వు!
ఆశ్చర్యం సుమా,
శ్వాస ఆపేసేంత అందం నీది
నీవు మాత్రమే పొందిన వరం.
నీ అందం,
అంతిమం ఆ అందం
నీ కంటి వెలుగు,
ఆ చిరునవ్వు
కేవలం నీవే పంచగలవు.
ఆ అందమైన చిరునవ్వును
దయచేసి నవ్వుతూ ఉండు.
ఇదే
నీవైన అందం.
నీ నిజమైన అస్తిత్వం.

 నిరుత్సాహం

నిశ్చలంగా ఉండలేకపోయా
అవసరం ముగిసి
ప్రయత్నంలో ఎదో లోటు
నిలబడలేని స్థితి .....
నీవు చెప్పిన దారిలోనూ
చివరికి
నన్ను విఫలం చేయాలనే
నీ నవ్వులోనూ
కేవలం ముగింపే కావాలని
కోరుకున్నా
గమ్యాన్ని చేరాలెలాగైనా అని
కానీ, నిలువలేకపోయా
యోధుడ్ని కాదనే వాదన
నీ మాటల్లో .....
నడక సాధ్యం కాదేమో అని
నేనూ అనుకున్నా